ఉద్యోగులకు నచ్చిన అత్యుత్తమ కంపెనీలు

లండన్‌ : 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు' అని అంటారు. అది మూటా ముళ్లె మోసే మోటు పనులకు వర్తిస్తుందేమో కానీ, ఆఫీసులో కంప్యూటర్ల ముందు కూర్చొని గంటలు గంటలు పనిచేసే వారికి వర్తించకపోవచ్చు! ఉల్లాసంగా పనిచేసే సంస్కృతి ఆఫీసులో ఉండడం, చేసే పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తే చేసే పని పట్ల ఉద్యోగులకు తృప్తి, సంతృప్తి ఉంటుంది. ఏవో కొన్ని కంపెనీల్లో తప్పా ఎక్కువ కంపెనీల్లో ఇలాంటి సంస్కృతి మచ్చుకైనా కనిపించకపోవచ్చు!కంపెనీ యాజమాన్యం ఉత్తమ సంస్కృతిని పాటించడం, ఉద్యోగాలకు తగిన భద్రత, ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు ఇవ్వడమే కాకుండా అందుకు తగినట్లుగా పదోన్నతులు కల్పించడం, ఉద్యోగులకు ఉల్లాసానికి క్రీడా కార్యక్రమాలతోపాటు అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అన్నింటికన్నా జీత భత్యాలు మెరుగ్గా ఇవ్వడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని బ్రిటన్‌లో ఏయే కంపెనీలు ఉత్తమమైనవి? వాటిలో నెంబర్‌ వన్, నెంబర్‌ టూ, త్రీ... లు ఏమిటీ? అన్న విషయంలో ఉద్యోగావకాశాలను కల్పించే ప్రముఖ సంస్థ 'ఇండీడ్‌' అధ్యయనం జరిపింది.అనూహ్యంగా రైతులకు క్రిమి సంహారక మందులను విక్రయించే బ్రిటన్‌లోని 'రెంటోకిల్‌ ఇన్సియల్‌' అనే కంపెకీ నెంబర్‌ వన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఇలా 25 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేయగా, గతేడాది మొదటి స్థానాన్ని సాధించిన అమెరికా దిగ్గజ సంస్థ 'ఆపిల్‌' ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. బ్రిటన్‌లో ఉన్న దేశ, విదేశ కంపెనీలకే ఈ అధ్యయనాన్ని పరిమితం చేశారు. వేలాది మంది ఉద్యోగుల అభిప్రాయలతోపాటు నిపుణుల సమీక్షలను, కంపెనీ పత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా మొదటి ఐదు కంపెనీల్లో నాలుగు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే కాగా, మొదటి పదిలో ఆరు కంపెనీలు బ్రిటన్‌కు చెందినవే. ఉత్తమ ఐదు కంపెనీలో బ్రిటన్‌కు చెందని కంపెనీ 'ఆపిల్‌' అని సులభంగానే గ్రహించవచ్చు. ఆపిల్‌ బ్రిటన్‌ బ్రాంచ్‌లో ఆరున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.