అర్ధసెంచరీకి అడుగు దూరంలో..

షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకూ చేసిన ప్రయోగాల్లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌దే అగ్రతాంబూలం. 74 ప్రయోగాల్లో 49 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లే ఉన్నాయి. 1993 సెప్టెంబర్‌ 20న తొలిసారిగా పీఎస్‌ఎల్‌వీ డీ–1, 2017 ఆగస్ట్‌ 31న ప్రయోగించింది. 27ఏళ్ల ముందు మొదలైన విజయపరంపర కొనసాగుతోంది. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్‌ బహుళ ప్రయోజనకారిగా మారి ఇస్రో చరిత్ర, గతినే మార్చేసింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఇస్రోకు నమ్మకమైన బ్రహ్మాస్త్రంలా తయారైంది.




బుధవారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌తో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌ అర్ధసెంచరీని పూర్తి చేసుకోనుంది. ఇస్రోకు దేశీయంగానే కాకుండా వాణిజ్యపరమైన ప్రయోగాల్లోనూ అగ్రస్థానంలో వెలుగొందుతూ బహుళ ప్రయోజనకారిగా దోహదపడుతోంది. దేశీయంగా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలతో పాటు అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్తూ ఆదాయ గనిగా మారింది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకే సారి పది ఉపగ్రహాలు, మళ్లీ 20 ఉపగ్రహాలు, ఆ తర్వాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎల్వీకే సొంతం. ఇప్పటివరకు 49 పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 310 విదేశీ ఉపగ్రహాలు, 46 స్వదేశీ ఉపగ్రహాలు, దేశంలోని పలు యూనివర్సిటీలకు 10 స్టూడెంట్‌ ఉపగ్రహాలను పంపించి ఇస్రో ప్రగతికి బాటలు వేస్తోంది.