ఢిల్లీలో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్టాలకు నిధుల శాతం పెంపు, రుణపరిమితి పెంపునకు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతులకు నిధులు ఇవ్వాలని మంత్రి కోరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ నిర్వహణకు నిధులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఎన్‌కే సింగ్‌కు మంత్రి అందజేశారు. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని మంత్రి హరీష్‌రావు కోరారు. గతంలో మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్‌కే సింగ్‌తో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను వివరించామని తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించాం. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాన్ని ఎన్‌కే సింగ్ కొనియాడారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్‌కే సింగ్ అభినందనలు తెలిపారని హరీష్‌రావు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ. 42 వేల కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ లేఖలో కోరారని మంత్రి తెలిపారు. తాము అడిగిన అంశాల పట్ల చైర్మన్ సానుకూలంగా స్పందించారని హరీష్‌రావు స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి సంవత్సరం పెరిగింది. ఈ క్రమంలో ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చైర్మన్ చెప్పారని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో దక్షిణ ప్రాంత సదస్సు నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సదస్సు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టను సందర్శిస్తామని ఎన్‌కే సింగ్ తెలిపినట్లు మంత్రి హరీష్‌రావు చెప్పారు.